ప్రజా వినతులు, దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి…!
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, దరఖాస్తులను జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన పి. వెంకన్న తనకు వినికిడి సమస్య ఉందని, సదరం సర్టిఫికెట్ జారీ చేసి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డీఆర్డీఓకు పంపిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కైకొండాయిగూడెం గ్రామానికి చెందిన ముస్లిం ప్రతినిధులు తమ గ్రామంలో 40 కుటుంబాలు నివసిస్తున్నాయని, అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామంలోని సర్వే నంబర్ 223/ఏలో ఉన్న 3 ఎకరాల 3 గుంటల ప్రభుత్వ భూమిలో ఒక ఎకరం కబ్రస్థాన్ కోసం కేటాయించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. దీనిపై తహసీల్దార్‌కు పంపిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన ఏ. మునయ్య తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పీడీ హౌసింగ్‌కు పంపిస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన వేముల వెంకటేష్ తన కుమారులకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అందేలా ఫీ రీయింబర్స్మెంట్ వచ్చేలా చూడాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారులకు పంపిస్తూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. రామమూర్తి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

