📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజనగామ గడ్డపై 1990 నాటి కథ - చిటకోడూరులో ఘనంగా నూతన చిత్రం, చిత్రీకరణ ప్రారంభం

జనగామ గడ్డపై 1990 నాటి కథ – చిటకోడూరులో ఘనంగా నూతన చిత్రం, చిత్రీకరణ ప్రారంభం

📰 Generate e-Paper Clip

జనగామ గడ్డపై 1990 నాటి కథ – చిటకోడూరులో ఘనంగా నూతన చిత్రం, చిత్రీకరణ ప్రారంభం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి):
జనగామ మండలం చిటకోడూరు గ్రామంలోని శ్రీ పంచకోసు రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం జనగామ యువకులు నిర్మిస్తున్న నూతన చిత్రం, చిత్రీకరణకు ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది.

ముందుగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ శాసనసభ్యులు, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్. రాజారెడ్డి, జనగామ పురపాలక సంఘం మూడో వార్డు సభ్యురాలు బూడిద జ్యోతి చప్పట్లు కొట్టి చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభించారు. స్వామి వారి ఆశీర్వాదంతో చిత్రం ఘన విజయం సాధించాలని చిత్ర బృందం ఆకాంక్షించింది.
జనగామ పట్టణానికి, జిల్లాకు చెందిన యువకులు తెలంగాణ ప్రాంతంలో, జనగామ ప్రాంతంలో 1990 సంవత్సరం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను, ప్రజల జీవన విధానాన్ని ప్రధానంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్ర దర్శకుడు చాగంటి టింకు (జితేందర్) వివరించారు.

ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు, నిర్బంధం, వాటి పరిష్కారానికి ప్రజలు నిర్వహించిన వీరోచిత పోరాటాలు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి జరిగిన కృషి, కుటుంబ సంబంధాలు, త్యాగం, అవినీతికి వ్యతిరేకంగా ఆనాడు యువకులు పోషించిన పాత్ర ప్రాతిపదికగా, కొన్ని కల్పిత అంశాలను తీసుకొని ఈ చిత్రం రూపొందుతోంది.

సమాజంలో జరిగే అన్యాయాన్ని, అవినీతిని ధైర్యంగా ఎదుర్కొని, ప్రజల కోసం నిలబడిన ఒక వ్యక్తి కథను ఈ చిత్రంలో చూపించనున్నారు. దీనితో పాటు కుటుంబ బంధాలు, అనుబంధాలు, త్యాగం, మానవతా విలువలు, సామాజిక బాధ్యత వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటాయి. పూర్తిగా కల్పిత కథ అయినప్పటికీ, 1990 నాటి గ్రామీణ వాతావరణం, అప్పటి ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, వారి కష్టసుఖాలను కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించనున్నారు.

ప్రతి ప్రేక్షకుడికి అనుసంధానమయ్యే విధంగా, కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు. జనగామ గడ్డపై, మన గ్రామీణ నేపథ్యంలోనే ఈ కథను తెరకెక్కించడం ఎంతో గర్వంగా ఉందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తామని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్. రాజారెడ్డి, జనగామ పురపాలక సంఘం మూడో వార్డు సభ్యురాలు బూడిద జ్యోతి మాట్లాడుతూ, సామాజిక దృక్కోణంతో జనగామకు చెందిన యువకులు చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

తెలంగాణలో జనగామ అంటే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పోరాటయోధులు, సామాజిక ఉద్యమకారులకు నిలయమని అన్నారు. జనగామ ప్రాంత చరిత్రను ప్రతిబింబించే విధంగా ఈ చిత్రం నిర్మాణం జరగడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి దర్శక నిర్మాతలకు అందరూ సహకరించాలని, చిత్రం విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

జనగామ జిల్లా నుండి ఇలాంటి మంచి చిత్రాలు రావడం అభినందనీయమని, ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
కథ, దర్శకత్వం చాగంటి టింకు (జితేందర్),
సహాయ దర్శకుడు మరియు సంభాషణల రచయిత మధు ఉప్పునుతుల,
నటుడు మరియు సహాయ దర్శకుడు మధు కన్నా,
ఛాయాగ్రహణం క్రాంతి నీల,
నటుడు వై. జగన్ వ్యవహరించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్. రాజారెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జనగామ పురపాలక సంఘం 3వ వార్డు సభ్యురాలు బూడిద జ్యోతి,
న్యాయవాది ఎండబట్ల పర్శరాములు,
విలేకరులు తిప్పారపు ఉపేందర్, మంచికట్ల రాజు, గోపగోని వినయ్, జేరిపోతుల ఉపేందర్
విశ్రాంత రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగి ఎలుకట్టే జగన్నాథం,
రంగు రాజశేఖర్,
వీరితో పాటు చిత్ర బృందం సభ్యులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.