*రాష్ట్రస్థాయి షార్ట్ ఫిల్మ్ పోటీల్లో తృతీయ స్థానం*
*దర్శకుడు నిప్పొత్తుల నాగరాజును సన్మానించిన సీపీ*
*మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆన్ లైన్ షార్ట్ ఫిల్మ్ పోటీల్లో రామగుండం కమిషనరేట్ తరపున పంపిన భరోసా షార్ట్ ఫిల్మ్ తృతీయ స్థానం సాధించింది. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎంపిక చేసిన ఈ చిత్రానికి జిల్లాలోని జైపూర్ మండలం నర్వ గ్రామానికి చెందిన నిప్పొత్తుల నాగరాజు దర్శకత్వం వహించారు. బుధవారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా, దర్శకుడు నాగరాజును శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకం, భరోసాను పెంపొందించేలా షార్ట్ ఫిల్మ్ లు రూపొందించాలని సూచించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేలా నాణ్యమైన చిత్రాలను ప్రొఫెషనల్ స్థాయిలో రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


