*విశ్వశాంతి పాఠశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం*
రాయికల్, నవంబర్ 11(ప్రజావాణి)
రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు.ఆయన విద్యను ప్రతి ఒక్కరి హక్కుగా భావించారని, దేశ అభివృద్ధికి విద్య ఎంతో అవసరమని బలంగా విశ్వసించారని అన్నారు.విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం, పరీక్షల్లో మార్కులు సాధించడం మాత్రమే కాదని, విద్య మనకు జ్ఞానాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని అందిస్తుందని విద్యార్థులకు తెలిపారు.మీరు జీవితంలో గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకోండి. ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకోండి. ఉపాధ్యాయులను గౌరవించండి. తల్లిదండ్రుల మాటలను పాటించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని సూచించారు.చదువు మన జీవితానికి వెలుగు. క్రమశిక్షణ మన విజయానికి మార్గం. కృషి మన లక్ష్యానికి పునాది. మంచి ఆలోచనలు మన భవిష్యత్తుకు బాటలు అని అన్నారు.ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు (AI), సైన్స్ మరియు పరిశోధన రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, అందుకు అనుగుణంగా విద్యార్థులు కూడా నూతన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు.మన పాఠశాల లక్ష్యం కేవలం మంచి మార్కులు సాధించే విద్యార్థులను తయారు చేయడం మాత్రమే కాదు, మంచి పౌరులుగా, బాధ్యతగల వ్యక్తులుగా, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడమేనని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, అఫ్సర్, రజిత, సంజన, ఇందుజ, స్రవంతి, కవిత, సాయిహర్ష, సౌజన్య, కళ్యాణి, మాలతి, అహల్య, గీత రాణి, ప్రవళిక, కావ్య, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

