*రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం*
*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్*
*ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం*
* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే రాష్ట్రంలో కొలువైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, దళారీ వ్యవస్థకు తావులేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచనల మేరకు, రానున్న వేసవి కాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, నీటి లభ్యతపై ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులు పెద్ద మనస్సుతో ఆలోచించి, వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసుకునే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. రైతులు వ్యవసాయ రంగంలో ఎదురయ్యే మార్పులను దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ లాభదాయకమైన పంటలను సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య, కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, మెప్మ పీడీ సుభాష్, టీఎంసీ,ఐకెపి సెంటర్ ఇంచార్జీ వర్ష, అగ్రికల్చర్ ఏఈ మహేందర్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లింగయ్య, దర్ని మల్లేష్,మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యాల కొమురయ్య,తీగల్పహాడ్ మాజీ సర్పంచ్ తెలేటి కిష్టయ్య,కాంగ్రెస్ పార్టీ సీతారాంపల్లి ఇంచార్జీ కొక్కిరాల మోహన్ రావు,మాజీ వార్డు సభ్యులు గౌస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


