జర్నలిస్టుల సమస్యలపై సంఘటిత పోరాటం!
– జర్నలిస్టులు ప్రజా సమస్యలపై ధైర్యంగా ప్రశ్నించాలి: ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
– నకిలీ జర్నలిస్టుల బ్లాక్‌మెయిలింగ్‌కు అడ్డుకట్ట వేయాలి
– జర్నలిస్టుల హక్కుల సాధనలో రాజీపడేది లేదు: రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
– మహిళా జర్నలిస్టుల సంఖ్య మరింత పెరగాలి
రామచంద్రాపురం, నవంబర్ 4, (ప్రజావాణి):జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలని, సమాజంలోని అవినీతి, అక్రమాలను వెలికితీస్తూ ప్రజా సమస్యలపై ధైర్యంగా ప్రశ్నించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు సమాజంలో గతంలో ఉన్న గౌరవం, విశ్వసనీయత తగ్గడానికి గల కారణాలపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
రామచంద్రాపురంలో బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన నిర్వహించిన టీయూడబ్ల్యూ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో విస్తరించిన యూనియన్ ప్రతి జర్నలిస్టు సమస్యను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కింది స్థాయి వరకు సమస్యల పరిష్కారానికి స్థానిక నాయకత్వం బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఏప్రభుత్వం అధికారంలో ఉన్నా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జర్నలిస్టులు తమ సమస్యలపై ధైర్యంగా ప్రశ్నించాలని, వారి పోరాటాలకు సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జర్నలిజం ముసుగులో నకిలీ గుర్తింపులతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిని అరికట్టాలని, అలాంటి వ్యక్తుల వల్ల నిజమైన జర్నలిస్టుల గౌరవం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనలో రాజీపడేది లేదని, సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. జర్నలిస్టుల నైపుణ్యాభివృద్ధికి మీడియా అకాడమీ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మీడియా రంగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని, మహిళా జర్నలిస్టులు ఎక్కువ సంఖ్యలో వృత్తిలోకి రావాలని ఆకాంక్షించారు.
మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘాలు మరింత బాధ్యతతో పనిచేయాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, మాజీద్, ఎం.ఏ.కే. ఫైసల్, వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధు గౌడ్, యూసఫ్ బాబా, రాజేష్, మహిళా జర్నలిస్టు నాయకులు అరుణ, రాజేశ్వరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

