మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 9 దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి 4 ద్విచక్ర వాహనాలు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడిని బబ్లు పాశ్వాన్ (45)గా గుర్తించారు. ఇతడు కూలీగా పనిచేస్తూ ప్రస్తుతం చింతల్‌లోని షా సినిమా థియేటర్ వెనుక గణేష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్వస్థలం జార్ఖండ్‌లోని గిరిడిహ్ ప్రాంతంగా పోలీసులు పేర్కొన్నారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 9 దొంగతనం కేసులు ఛేదించినట్లు మెడిపల్లి పోలీసులు వెల్లడించారు.
నిందితుడిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

