*వల్లభి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా…?
*ఆంధ్ర నుండి నేలకొండపల్లి చేరుతున్న ఇసుక
*పర్యవేక్షణ కరువు.. చర్యలు శూన్యం..?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా ముదిగొండ నేలకొండపల్లి మండలాలకు ఆంధ్ర ప్రదేశ్ లోని మల్కాపురం నుండి నిత్యం ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు ముదిగొండ నేలకొండపల్లి మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా వల్లభి కేంద్రంగా ఇసుక దందా ఎటువంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో అక్రమార్కులు యధావిధిగా పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా పాల్పడుతూ దండిగా దండుకుంటున్నారని పలువురు ప్రజలు స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం మిట్ట మధ్యాహ్నం నేలకొండపల్లి మండల పరిధిలోని చెరువు మాదారం గ్రామంలోని ఓ బజారులో ఇసుక ట్రాక్టర్ ఓ మంచినీటి పైపులైను వద్ద దిగబడటంతో సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి ఆ ప్రదేశాన్ని పరిశీలించి సంబంధిత వ్యక్తుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ట్రాక్టర్ను ఆగ మేఘాల మీద బయటికి తీసి ట్రాక్టర్ తో పరారైనట్లు పంచాయతీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రోడ్లను ధ్వంసం చేస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయని పలువురు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా మితిమీరిన వేగంతో రాకపోకలు సాగించటంతో ప్రజలు వాహనదారులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ముఠాలపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని ముదిగొండ నేలకొండపల్లి మండల ప్రజలు ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

