*రాయికల్ మండలంలో దూసుకుపోతున్న అభివృద్ధి పనులు*
—-ఒకేరోజు మూడు గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సుడిగాలి పర్యటన
*రాయికల్, అక్టోబర్ 09 (ప్రజావాణి):*
రాయికల్ మండలంలో అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయి. జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ శుక్రవారం ఒకేరోజు మండలంలోని భూపతిపూర్, సింగరావుపేట, కొత్తపేట గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామగ్రామానా ఎమ్మెల్యేకు ప్రజలు,నాయకులు ఘన స్వాగతం పలికారు.తొలుత భూపతిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సింగరావుపేట గ్రామంలో చిరకాలంగా ఉన్న లో ఓల్టేజ్ సమస్యకు చెక్ పెడుతూ 100 కేవీ సామర్థ్యం గల నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు.
దీంతో గ్రామంలో విద్యుత్ సమస్య పూర్తిగా తొలగిపోయినట్లయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పేదలకు లబ్ది చేకూరుతోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ అన్ని వర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అక్కడి నుండి కొత్తపేట గ్రామానికి చేరుకుని సయ్యద్ హసీనా బేగం-అహ్మద్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని నూతన ఇంటిని ప్రారంభించారు.అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో ఆత్మా చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు
రవీందర్ రావు, సర్పంచులు కృష్ణమూర్తి, మీనుగు గంగు అంజయ్య, ప్యాక్స్ చైర్మన్లు తంగెళ్ల రమేష్, ఏనుగు మల్లారెడ్డి,నిమ్మల శేఖర్ రెడ్డి, ఎంపీడీవో చిరంజీవి,ఏడీఈ సింధూర్ శర్మ, ఏఈ నవీన్ కుమార్, సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

