*రాజరాజేశ్వరి కాలనీ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు!*
*ఈర్ల రాజు ముదిరాజ్ నివాసంలో బీజేపీ ముఖ్య నేతల భేటీ..*
*పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై విస్తృత చర్చ*
అమీన్‌పూర్, అక్టోబర్ 7 (ప్రజావాణి): అమీన్‌పూర్ మండలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ ముఖ్య నాయకులు కార్యాచరణపై దృష్టి సారించారు. అమీన్‌పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ స్వగృహంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మీనా గౌడ్ తదితరులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అమీన్‌పూర్ మండలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, రాబోయే పార్టీ కార్యక్రమాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రజల్లోకి బీజేపీ.. సేవా కార్యక్రమాలు విస్తృతం
జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ అమీన్‌పూర్ మండలంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు. మోదీ సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా సేవా కార్యక్రమాలను గ్రామాలు, కాలనీల స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు.
ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం, కష్టపడే కార్యకర్తల సమష్టి కృషితోనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అమీన్‌పూర్ మండలంలో పార్టీ విస్తరణకు జిల్లా పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి
రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా పార్టీలో చేరుతున్న వారిని ఆత్మీయంగా స్వాగతించి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని అన్నారు. కార్యకర్తల సమష్టి కృషితో అమీన్‌పూర్ మండలంలో బీజేపీకి మరింత ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు.
రాజరాజేశ్వరి కాలనీ నుంచి భారీగా చేరికలు
సమావేశం సందర్భంగా పటేల్‌గూడ శ్రీ రాజరాజేశ్వరి కాలనీకి చెందిన పలువురు ప్రజలు గోదావరి అంజిరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ నాయకులు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో చేరికలు జరగడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ రాజరాజేశ్వరి కాలనీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు. ప్రజల విశ్వాసమే తమ బలమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమం, సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతోందని అన్నారు. మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అమీన్‌పూర్ మండలంలో ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి గ్రామం, ప్రతి కాలనీలో బీజేపీని ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు.
రాబోయే రోజుల్లో అమీన్‌పూర్ మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఈర్ల రాజు ముదిరాజ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్వగృహానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మహిళా నాయకురాలు మీనా గౌడ్ తదితరులను ఈర్ల రాజు ముదిరాజ్ దంపతులు నూతన వస్త్రాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కొండా లక్ష్మణ్ గుప్తా, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మీనా గౌడ్, ఇతర మహిళా నాయకురాళ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజరాజేశ్వరి కాలనీకి చెందిన పలువురు పాల్గొన్నారు.

