మహిళా సాధికారత, స్వయం ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మంచిర్యాలలో జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశం
మంచిర్యాల, అక్టోబర్ 30 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సమావేశం అల్లం అనిత అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్య, జిల్లా కార్యక్రమ నిర్వాహకులు స్వర్ణలత, వనజ, జేడీఎం రాంచందర్, ఆర్‌ఎం రమణ హాజరై మహిళా సంఘాల అభివృద్ధి, పనితీరు మెరుగుదలపై పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జిల్లాలోని 16 మండలాల మహిళా సమాఖ్య అధ్యక్షులు, జిల్లా సమాఖ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మహిళా సాధికారత, సంఘాల బలోపేతం, దివ్యాంగుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, మహిళల హక్కులు, లఖ్‌పతి దీదీ పథకం, సమాచార నిర్వహణ, బ్యాంకు రుణాల అనుసంధానం, మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు, ఆహార శుద్ధి పరిశ్రమలు, స్త్రీనిధి పనితీరు మెరుగుదల తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తూ, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో సూచించారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
సమావేశాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు, జిల్లా సమాఖ్య సభ్యులకు, 16 మండలాల మహిళా సమాఖ్య అధ్యక్షులకు జిల్లా మహిళా సమాఖ్య కృతజ్ఞతలు తెలిపింది.

