📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్

మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్

📰 Generate e-Paper Clip

*మందమర్రి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్*

*మన ప్రజావాణి*
మందమర్రి అక్టోబర్ 01

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ చేశారు.మందమర్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, మందమర్రి ఎస్‌ఐ నరేష్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు.అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్,స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రిసెప్షన్ కేంద్రం సిబ్బందితో మాట్లాడి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, సిబ్బంది బ్యారక్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, అన్ని రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు.
స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి వ్యక్తిగత, శాఖాపరమైన అంశాలతో పాటు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా నమోదవుతున్న నేరాలు,పెండింగ్ కేసులు,దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు,నేర నియంత్రణ చర్యలు, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ తదితర అంశాలపై స్టేషన్ ఎస్‌ఐను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని అన్ని విభాగాల పనితీరును సమీక్షించినట్లు తెలిపారు. రిసెప్షన్ కేంద్రం పనితీరు, పెట్రోల్ వాహనాల నిర్వహణ,పెండింగ్ కేసుల పురోగతి, వివిధ విభాగాల పనితీరు, ప్రజలకు అందిస్తున్న పోలీస్ సేవలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించినట్లు పేర్కొన్నారు. మందమర్రి సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఉండటంతో ఇక్కడ ప్రత్యేకమైన సవాళ్లు ఉన్నాయని సీపీ తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగే దొంగతనాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్టేషన్ అధికారులకు సూచించారు.
గతంలో కేసులు నమోదైన వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచుతూ వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అవసరాన్ని బట్టి నిబంధనల ప్రకారం గ్యాంగ్ ఫైళ్లను ప్రారంభించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందమర్రి ప్రాంతంలో నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి నేర రహిత, మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని పోలీస్ అధికారులకు సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు.ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన పోలీస్ సేవలు అందించేలా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.