భూపాలపల్లిలో మెగా జాబ్ మేళాకు ఏర్పాట్లు పూర్తి
భూపాలపల్లి, అక్టోబర్ 8 మన ప్రజావాణి : జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.జాబ్ మేళాకు అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థుల సౌకర్యార్థం 15 రిజిస్ట్రేషన్ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అభ్యర్థుల కోసం ప్రత్యేక కౌంటర్లు, టెంట్లు, షామియానాలతో పాటు తాగునీరు, భోజనం, విద్యుత్, పార్కింగ్ తదితర సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువత కోసం ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జాబ్ మేళా విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఉదయం 7 గంటలకే పుష్ప గ్రాండ్‌కు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. రిజిస్ట్రేషన్, క్యూల నిర్వహణ, రవాణా తదితర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రాంగణంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను, వైద్య కేంద్రం, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన వైద్యులు, బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.నిరుద్యోగ యువతీ యువకులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.

