ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి అవార్డు పురస్కారం
జమ్మికుంట అక్టోబర్ 02 (ప్రజావాణి)
సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్‌లో జమ్మికుంటకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబు ప్రతిష్టాత్మక సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డుకు ఎంపికయ్యారు శుక్రవారం రోజున హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిగ్మా అకాడమీ ప్రధాన కార్యదర్శి కోరముళ్ళ జనార్ధన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంసీ శేఖర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దీనికితోడు, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సిగ్మా అకాడమీ నిర్వహించనున్న ఫోటోగ్రఫీ ప్రదర్శనకు గాను రాంబాబు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెంట్ ఎగ్జిబిటర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ వృత్తిలో కొనసాగుతున్న రాంబాబు గిరిజనులు ఆదివాసీల జీవనశైలి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, ప్రకృతి రమణీయతలను తన కెమెరా కంటితో ఆవిష్కరించడంలో ప్రత్యేక శైలినిచాటుకుంటున్నారు గతంలో 2007, 2010లలో లంబాడీ జీవనశైలి చిత్రాలతో జిల్లా స్థాయిలో 2011లో వరంగల్ రాష్ట్రస్థాయి పోటీల్లో 2016 ఖమ్మం జాతీయ ఫోటో వర్క్‌షాప్ పర్యాటక విభాగంలో ద్వితీయ స్థానం పొందిన ఆయన ఇటీవల కేబీఆర్ పార్కులో అటవీ శాఖ నిర్వహించిన కెమెరా కళ్ళు పోటీల్లో రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో తృతీయ బహుమతి సాధించి తన ప్రతిభను చాటుకున్నారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాంబాబును పలువురు ఫోటోగ్రాఫర్లు, స్థానికులు అభినందించారు.

