పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థినిపై రంపంతో దాడి.. బాలికలకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం ఎందుకు
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 రాప్తాడు మండలం అనంతపురం జిల్లా
విద్యార్థుల సమస్యలపై జెండాలు పట్టుకొని పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకులు వెళ్తే నారా లోకేష్ జీవోలతో అడ్డుకుంటారు.. రంపాలు పట్టుకొని దుండగులు వస్తే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి!
రాప్తాడు ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి – సిపిఐ (యమ్ యల్) లిబరేషన్, ఏఐఎస్ఏ
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై దుండగులు తరగతి గదిలోకి చొరబడి రంపంతో దాడి చేయడం అత్యంత ఆందోళనకరమైన ఘటన. విద్యార్థులు చదువుకుంటున్న తరగతి గదిలోకి ఆయుధాలతో దుండగులు ప్రవేశించి బాలికపై దాడికి పాల్పడటం ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో స్పష్టం చేస్తోంది. విద్యార్థినులు నిర్భయంగా చదువుకోవాల్సిన పాఠశాలల్లోనే వారి ప్రాణాలకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ పాలన, పోలీసు వ్యవస్థ, విద్యాశాఖ పనితీరుపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఈరోజు ఘటన జరిగిన పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్న సిపిఐ (యమ్ యల్) లిబరేషన్ పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి జి. వేమన,ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కన్వీనర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించడానికి, వారి హక్కుల కోసం జెండాలు పట్టుకొని విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలల్లోకి వెళ్తే జీవోలు, ఆంక్షల పేరుతో అడ్డుకునే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అదే పాఠశాలల్లోకి రంపాలు, ఇతర ఆయుధాలతో దుండగులు చొరబడుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. విద్యార్థి సంఘాల గొంతు నొక్కేందుకు చూపిస్తున్న శ్రద్ధ, పాఠశాలల్లో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు.
పాఠశాలకు సమీపంలోనే పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయం ఉన్నప్పటికీ ఇలాంటి దాడి జరగడం పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలపై అనేక సందేహాలను కలిగిస్తోందన్నారు. మహిళలకు, బాలికలకు రక్షణ కల్పిస్తామని ప్రకటనలు చేసే కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఆడబిడ్డలకు కనీస భద్రత కల్పించలేకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ బాలికలపై దాడులు జరగడం, పాఠశాలల్లోకి దుండగులు చొరబడటం ప్రభుత్వ భద్రతా హామీలకు అద్దం పడుతోందన్నారు.
విద్యార్థుల హక్కుల కోసం పోరాడే సంఘాలను అడ్డుకోవడమే ప్రభుత్వ ప్రాధాన్యతా? లేక విద్యార్థుల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ బాధ్యతా? అని ప్రశ్నించారు. పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే సురక్షిత ప్రదేశాలుగా ఉండాలి తప్ప, దాడులకు నిలయాలుగా మారకూడదన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను ప్రభుత్వం సాధారణ సంఘటనగా తీసుకోకుండా సమగ్ర విచారణ జరిపించాలి. దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఘటన వెనుక ఉన్న కారణాలు, భద్రతా వైఫల్యాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి. బాధిత విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించడంతోపాటు పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి. బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక పరిహారం అందించి అండగా నిలవాలి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలి. పాఠశాలల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. అవసరమైన చోట సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
బాలికలకు పాఠశాలల్లోనే భద్రత కల్పించలేని ప్రభుత్వం మహిళా భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు ఏమిటి? విద్యార్థుల హక్కుల కోసం గొంతెత్తే సంఘాలను అణచివేయడం కాదు.. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ మొదలగు చర్యలు తీసుకుని తక్షణమే అరెస్టు చేసి శిక్ష విధించాలని కోరడమైనది.

