జాతీయ ఐక్యతా ఉత్సవాలకు వికారాబాద్ ప్రతినిధిగా డాక్టర్ జానకిరాం
కేవడియాలో జరిగే ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’కు కులకచర్ల మాజీ సర్పంచ్‌కు పిలుపు
ఉక్కుమనిషి సర్దార్ పటేల్ విగ్రహం సాక్షిగా దేశ సమైక్యతా వేడుకలు
పాల్గొనడం గర్వకారణమన్న జిల్లా దిశ కమిటీ సభ్యులు
పరిగి, అక్టోబర్ 28 ( ప్రజావాణి)
గుజరాత్ రాష్ట్రం నర్మదా నది తీరాన, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ప్రాంగణంలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం) వేడుకలకు వికారాబాద్ జిల్లా నుంచి విశిష్ట ప్రాతినిధ్యం లభించింది. కులకచర్ల మాజీ సర్పంచ్, జిల్లా దిశ కమిటీ సభ్యులు డాక్టర్ జానకిరాం ఈ జాతీయ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా అధికారిక ఆహ్వానం పొందారు.
స్వతంత్ర భారత తొలి హోం మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 560కి పైగా సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతావనిని నిర్మించిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని, ఆయన జయంతి రోజైన అక్టోబర్ 31ని కేంద్ర ప్రభుత్వం ఏటా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’గా నిర్వహిస్తోంది. కేవడియా (ఏక్తా నగర్) లోని 182 మీటర్ల సర్దార్ పటేల్ భారీ కాంస్య విగ్రహం చెంత దేశ రక్షణ దళాల పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా చేపడతారు.
ఈ మహోన్నత వేడుకల్లో వికారాబాద్ జిల్లా తరఫున పాలుపంచుకునే అవకాశం దక్కడంపై డాక్టర్ జానకిరాం సంతోషం వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను చాటిచెప్పే జాతీయ వేదికపై మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవప్రదంగా భావిస్తున్నానని తెలిపారు. జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపికైన డాక్టర్ జానకిరాంకు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రముఖులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

