జనగామ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విప్లవం – ఆధునిక వ్యర్థాల వేరుచేసే యంత్రానికి భూమిపూజ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): జనగామ పట్టణాన్ని స్వచ్ఛ, సుందర, ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జనగామ మున్సిపాలిటీ మరో కీలక ముందడుగు వేసింది. పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డులో పేరుకుపోతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆధునిక Dry and Wet Waste Segregation Machine (తడి, పొడి చెత్తను వేర్వేరు చేసే యంత్రం) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
ఈ మహత్తర కార్యానికి సంబంధించి శనివారం జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్ వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ… “జనగామ మున్సిపాలిటీ అభివృద్ధిలో పారిశుద్ధ్యానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. గతంలో డంపింగ్ యార్డులో మొత్తం చెత్త ఒకే చోట వేయడం వల్ల అనేక సమస్యలు వచ్చేవి. ఇప్పుడు ఈ నూతన సాంకేతిక యంత్రం రావడం వల్ల తడి చెత్త, పొడి చెత్తను ఆటోమేటిక్ గా వేరు చేయడం జరుగుతుంది. దీని వల్ల తడి చెత్త నుండి సేంద్రీయ ఎరువు (కంపోస్ట్) తయారీ, పొడి చెత్త నుండి రీసైక్లింగ్ ద్వారా ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది. ఇది నిజంగా ‘చెత్త నుండి సంపద’ అనే నినాదానికి నిదర్శనం” అని అన్నారు.
పట్టణ ప్రజలందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి, ఇంటి వద్ద నుండే తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, అప్పుడే స్వచ్ఛ జనగామ కల సాకారమవుతుందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ రాజశేఖరరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్, శానిటేషన్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
