జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం
జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02 (ప్రజావాణి): ప్రజాస్వామ్య పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా ఇండియా కూటమి పిలుపు మేరకు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్, వైటిడిఏ సభ్యులు డాక్టర్ ఎల్. లక్ష్మీనారాయణ నాయక్, మార్క్సిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న, తెలంగాణ జన సమితి జిల్లా ఇన్చార్జ్ ఎనగందుల ఉమాపతి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓటును కాపాడుకుందాం – దేశాన్ని కాపాడుకుందాం అనే కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాలు:

అక్టోబర్ 3న మండల కేంద్రాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులతో సంయుక్త సమావేశాలు.
అక్టోబర్ 5న మండల కేంద్రాల్లో కూటమి ఆధ్వర్యంలో ప్రదర్శనలు.
అక్టోబర్ 8న జిల్లా కేంద్రంలో కూటమి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల సుధాకర్, మాజీ పురపాలక చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు వేముల మల్లేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు మాజిద్ అప్సర్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జాయ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
