📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకబ్జాల బారిన పడకుండా ప్రజా స్థలాలను కాపాడాలి: మెట్టు శ్రీధర్

కబ్జాల బారిన పడకుండా ప్రజా స్థలాలను కాపాడాలి: మెట్టు శ్రీధర్

📰 Generate e-Paper Clip

కబ్జాల బారిన పడకుండా ప్రజా స్థలాలను కాపాడాలి: మెట్టు శ్రీధర్

చిట్కుల్ 7వ వార్డులో పార్కులు, రహదారుల స్థలాలను పరిరక్షించాలి: మెట్టు శ్రీధర్

ప్రజావాణిలో ఎంపీడీవో యాదగిరికి వినతిపత్రం

పటాన్చెరువు, అక్టోబర్ 26 (ప్రజావాణి): ప్రజల ఉమ్మడి అవసరాల కోసం కేటాయించిన పార్కులు, రహదారులు, ఇతర ప్రజా స్థలాలు ఆక్రమణల బారిన పడకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ 7వ వార్డులో ఆమోదిత లేఅవుట్లలో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను పరిరక్షించాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ చిట్కుల్ గ్రామంలోని సర్వే నంబర్లు 269, 284/పార్ట్, 303/పార్ట్, 304లో 2007 జనవరి 24న గ్రామ పంచాయతీ తీర్మానం నంబర్ 6/1 ద్వారా ఆమోదించిన లేఅవుట్‌లో 1,763.83 చదరపు గజాల పార్కు స్థలం, 11,242.21 చదరపు గజాల రహదారుల స్థలం కేటాయించినట్లు తెలిపారు. అలాగే సర్వే నంబర్లు 272, 303/పార్ట్‌లో 2019 జూన్ 11న హెచ్‌ఎండీఏ ఆమోదించిన లేఅవుట్ ప్రకారం 1,781.26 చదరపు మీటర్ల పార్కు స్థలం, 521.20 చదరపు మీటర్ల సామాజిక మౌలిక సదుపాయాల స్థలం ఉన్నట్లు వివరించారు.

కొంతమంది బిల్డర్లు లేఅవుట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజా స్థలాలకు ఆటంకం కలిగించేలా ప్రహరీ గోడలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి పార్కులు, రహదారుల హద్దులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆయా స్థలాలు మున్సిపాలిటీకి అప్పగించారా, ఆస్తుల రిజిస్టర్‌లో నమోదు చేశారా అనే విషయాలను నిర్ధారించాలన్నారు.

సంబంధిత భూములపై సంగారెడ్డి ప్రత్యేక సెషన్స్ కోర్టులో ఉన్న ఐ.ఏ. నంబర్ 14/2019, ఓ.ఎస్. నంబర్ 86/2019 కేసుల ప్రస్తుత స్థితిని పరిశీలించి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు గుర్తిస్తే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019 ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

జీవితకాల కష్టార్జితంతో ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసే ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలుకు ముందే హెచ్‌ఎండీఏ అనుమతులు, లేఅవుట్ వివరాలు, భూమి హక్కుల పత్రాలు, పార్కులు, రహదారుల కేటాయింపులు, కోర్టు వివాదాలను పరిశీలించుకోవాలన్నారు. ప్రజా స్థలాలను వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజావాణి వినతిపై చేపట్టిన చర్యలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ యాదవ్, శ్రీకాంత్, మాణిక్య ప్రభు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.