📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఓటు చోరీతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది

ఓటు చోరీతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది

📰 Generate e-Paper Clip

ఓటు చోరీతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది – ఏఐసీసీ పరిశీలకులు కేబీఆర్ నాయుడు

నవంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానాన్ని దద్దరిల్లజేద్దాం – డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి గెలుపు ఖాయం – ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఓట్ బచావో – దేశ్ బచావో రచ్చబండతో గ్రామ గ్రామాన అవగాహన

-జనగామలో కాంగ్రెస్ ప్రెస్ మీట్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 26(ప్రజావాణి): ఏఐసీసీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న “ఓట్ బచావో – దేశ్ బచావో” రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐఆర్ ఫేస్ –III కార్యక్రమంపై జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ పరిశీలకులు కేబీఆర్ నాయుడు మాట్లాడుతూ, దేశంలో జరుగుతున్న ఓటు చోరీతో ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్ల జాబితాలో అక్రమంగా మార్పులు, తొలగింపులు జరుగుతున్నాయని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మక కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా పర్యవేక్షణ, శుద్ధీకరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు సమాన విలువ ఉందని, ప్రజల ఓటు హక్కును కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. “ఓటు హక్కును కాపాడుకోవాలి – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి” అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి ని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.
టీపీసీసీ కో-ఆర్డినేటర్ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ, ఓటు చోరీ, సీట్ చోరీ వంటి అక్రమాలకు పాల్పడుతూ బీజేపీ అవినీతిని ప్రజలు గమనించాలని, గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త అవగాహన కల్పించాలని కోరారు.

ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉందని, రాబోయే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి ధన్వంతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమానికి జనగామ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని, అలాగే ఎల్ నినో ప్రభావం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దానిపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామం, వార్డు, బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను పరిశీలించాలని, ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాపాడాలని కోరారు.

స్టేషన్ ఘనపూర్ ఎస్ఐఆర్ ఇన్‌చార్జ్ దుద్దిళ్ల శ్రీనుబాబు, వైటిడిఏ మెంబెర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ లు మాట్లాడుతూ, ఓటు చోరీపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని, అక్రమాలకు పాల్పడుతున్న జ్ఞానేష్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్మన్ బాలమణి, పాలకుర్తి ఇంచార్జి ప్రమోద్ కుమార్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణ రెడ్డి, కంచ రాములు, డాక్టర్ రాజమౌళి, డీసీసీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, సురేష్ బాబు, కొత్త కరుణాకర్ రెడ్డి, కీసర దిలీప్ రెడ్డి, ఉడత రవి, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు వేముల మల్లేష్, బడికే ఇందిరా, లోకుంట్ల ప్రవీణ్, మాజిద్ అప్సర్, జాయ మల్లేష్, ఆర్టీఏ మెంబర్ అభి గౌడ్, మేకల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.