ఒదింగత మూడు నెలలుగా వాటర్ ట్యాంక్ సెంటర్ లో కృష్ణ వాటర్ పైప్ లైన్ లీకేజీ – స్ప
మురికినీటిలో కలసిపోతున్న కృష్ణమ్మ నీరు.. డెంగ్యూ, విష జ్వరాల భయంతో వణుకుతున్న ప్రజలు
స్పందించని కృష్ణ వాటర్ అధికారులు, చండూరు మున్సిపల్ కమిషనర్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ పరిధిలో అధికారుల తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. గత మూడు నెలలుగా పట్టణంలోని మెయిన్ సెంటర్ లో ఉన్న వాటర్ ట్యాంక్ సమీపంలో, సీసీ రోడ్డ( డ్రైనేజీ) కింద ఉన్న కృష్ణ వాటర్ మెయిన్ పైప్‌లైన్ తీవ్రంగా లీకేజీ అవుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు
*లక్షలాది లీటర్ల మంచినీరు డ్రైనేజీ పాలు*
మెయిన్ సెంటర్ నుంచి అంగడిపేట వైపు వెళ్లే ప్రధాన పైప్‌లైన్ లీకేజీ కావడం వల్ల కృష్ణా జలాలు పక్కనే ఉన్న మురుగు కాల్వలో కలిసి విపరీతంగా వృథా అవుతున్నాయి. స్థానికులు, వ్యాపారులు ఈ విషయాన్ని పలుమార్లు కృష్ణ వాటర్ అధికారుల దృష్టికి, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారిలో ఏమాత్రం చలనం రాకపోవడం గమనార్హం.
*రోగాలు వస్తే బాధ్యులెవరు*
లీకేజీ అవుతున్న ప్రాంతంలో సీసీ రోడ్డు కింద మురుగునీరు, మంచినీరు కలసిపోయే ప్రమాదం ఏర్పడింది. కలుషితమైన ఆ నీటిని తాగడం వల్ల విష జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఒకవేళ ప్రజా ఆరోగ్యం క్షీణించి, ప్రాణనష్టం వాటిల్లితే దానికి కృష్ణ వాటర్ అధికారులా లేక మున్సిపల్ కమిషనరా.. ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులే ఇంత దారుణంగా వ్యవహరించడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*సమస్య నా దృష్టికి వచ్చింది: మున్సిపల్ చైర్మన్*
ఈ విషయమై మున్సిపల్ చైర్మన్‌ను వివరణ కోరగా.. పైప్‌లైన్ లీకేజీ సమస్య తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో తక్షణమే లీకేజీకి మరమ్మతులు పూర్తి చేయించి, అంగడిపేట ప్రజలకు నిరంతరాయంగా సురక్షితమైన మంచి నీటి సరఫరా పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

