*రామప్ప దేవాలయ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం
*
.శాస్త్రీయ అధ్యయనాలు, భద్రతా ప్రమాణాల సమగ్ర పరిశీలన అనంతరమే నిర్ణయం.
.జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.
*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటాపూర్ మండల పరిధిలో చేపడుతున్న ఓపెన్‌కాస్ట్ మైనింగ్ పనుల వల్ల కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఓపెన్‌కాస్ట్ మైనింగ్ ఏర్పాటుకు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం మంజూరు అంశాలపై కమిటీ సభ్యులతో సమగ్రంగా చర్చించారు.
ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కు సంబంధించిన అంశాలపై ఆయా శాఖల అధికారులు తమ పరిధిలోని అభిప్రాయాలను వెల్లడించారు. రామప్ప దేవాలయ పరిరక్షణ, పర్యావరణం, శాస్త్రీయ అధ్యయనాలు, నిరంతర పర్యవేక్షణతోపాటు సంబంధిత నిబంధనలు, భద్రతా ప్రమాణాల పై విస్తృతంగా చర్చించారు. సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలను నమోదు చేశామని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, సింగరేణి భూపాలపల్లి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ జీఎం జి. దేవేందర్, పర్యావరణ విభాగం జీఎం పి. సైదులు, ఎక్స్‌ప్లోరేషన్ జీఎం పంకజ్ కులశ్రేష్ఠ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆర్. సునీత, పురావస్తు శాఖ సహాయ సంచాలకురాలు బి. గంగాదేవి, భారత పురావస్తు సర్వేక్షణ శాఖ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్లు అజిత్ ఎం.ఎస్., వంశీకృష్ణ జ్యోతి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు జె. శ్రీధర్‌రావు, ఆచార్య ఎం.పాండురంగారావు, పాలంపేట సర్పంచ్ సీహెచ్ రాజు, జిల్లా పంచాయతీ అధికారి కె. వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. శివాజీ, ఇర్రిగేషన్ ఈ ఈ నారాయణ, వెంకటాపూర్ తహసిల్దార్ గిరిబాబు, ఎం పి డి ఓ రాజు, సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

*
