మహబూబాబాద్ డీఈఓ ఏకైక పుత్రుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం.
కేసముద్రం సెప్టెంబర్ 03, ప్రజావాణి.
ఆ ఇంట ఉన్నది ఒకే ఒక్క దీపం.. ఆ తల్లిదండ్రులకు ఆయనే సర్వస్వం.. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో ఉన్నత చదువుల కోసం నగరానికి పంపిన ఆ కన్నవారి గుండెల్లో విధి కోలుకోలేని దెబ్బ కొట్టింది. మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సత్యనారాయణమూర్తి ఏకైక కుమారుడు వేద్ (21) హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విన్న కన్నవారు, బంధువులు షాక్కు గురై కన్నీరుమున్నీరవుతున్నారు.
కనుపాప దూరమై.. కన్నీటి సముద్రమై..
బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం సత్యనారాయణమూర్తి కుటుంబంలో ఎప్పటికీ పూడ్చలేని చీకట్లను నింపింది. ముద్దుల కొడుకు భవిష్యత్తును ఎంతో అందంగా తీర్చిదిద్దాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు, కుమారుడి మరణవార్త పిడుగుపాటులా తగిలింది. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడనే నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదనలు చూసి అక్కడికి చేరిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి.
కదిలిపోయిన విద్యాశాఖ..
వేద్ అకాల మరణం పట్ల మహబూబాబాద్ జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ఇస్లావత్ లచ్చిరాం నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు.విద్యాశాఖలో అందరికీ మార్గదర్శిగా ఉండే సత్యనారాయణమూర్తి కి ఇంతటి పెద్ద కష్టం రావడం అత్యంత బాధాకరం. ఆ దేవుడు కూడా ఇంత కఠినంగా ఎలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదుఅంటూ కన్నీటిపర్యంతమయ్యారు. జిల్లాలోని ఉపాధ్యాయ లోకం, విద్యాశాఖ అధికారులు సత్యనారాయణమూర్తి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పుట్టెడు దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఆ కన్నవారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు.

