భక్తులు, ఉత్సవ కమిటీల సహకారంతో నవరాత్రి ఉత్సవాలు విజయవంతం
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
గణేష్ నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం, పోలీస్ శాఖకు సహకరించిన భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ధన్యవాదాలు తెలిపారు. భక్తుల సమన్వయం, ఉత్సవ కమిటీల సహకారం, వివిధ శాఖల అధికారుల భాగస్వామ్యంతో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు.
బుధవారం స్థానిక ముస్తఫానగర్ చౌరస్తా వద్ద గణేష్ నిమజ్జన శోభాయాత్రను పోలీస్ కమిషనర్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ప్రారంభించారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రుల ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
నిమజ్జనం కోసం ప్రత్యేక ఘాట్ సిద్ధం చేసినట్లు తెలిపారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, అవసరమైన మౌళిక సదుపాయాలు, భద్రతా చర్యలు, ప్రజలకు మార్గనిర్దేశం చేసే ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు వివరించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో ప్రజా ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు చురుగ్గా పాల్గొంటూ తమ సహకారం అందించారని అన్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ, పోలీస్ శాఖ సూచనలను పాటించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది, పోలీసుల నిరంతర పర్యవేక్షణ తో,
గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునే వరకు అవసరమైన భద్రతా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. రాత్రంతా, నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు పరిస్థితులను పర్యవేక్షిస్తూ పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.
శోభాయాత్రలో పాల్గొనే భక్తులు, నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలు పాటించాలని కోరారు. శోభాయాత్రలో క్రమశిక్షణ పాటిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని సూచించారు. నిమజ్జన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి, చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలందరూ సమన్వయంతో వ్యవహరించి, నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు సహకరించాలని వారు కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే సంబంధిత సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో ఉత్సవ కమిటీలు, భక్తులు అందించిన సహకారం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో వ్యవహరించడం ద్వారా సోదరభావం, సామాజిక సమైక్యతను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.
నిమజ్జన వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. పోలీస్ శాఖ, మునిసిపల్ అధికారులు, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

అనంతరం ధంసలాపురం చెరువు వద్ద తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, భక్తుల రాకపోకలు, శోభాయాత్ర నిర్వహణ, భద్రతా చర్యలను వారు స్వయంగా పర్యవేక్షించి, నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్తంభాద్రి ఉత్సవ సమితి ప్రెసిడెంట్ వినోద్ లహోటి, వర్కింగ్ ప్రెసిడెంట్ జి. విద్యాసాగర్, జనరల్ సెక్రటరీ కె. జయపాల్ రెడ్డి, కన్వీనర్ కన్నం ప్రసన్న కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లిక అంజయ్య, ట్రెజరర్ ఎం. శ్రీహరి, సెక్రటరీ డోవలె సాయికిరణ్, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

