*పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి*
—-జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
*రాయికల్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి):*
సంస్కృతి, సంప్రదాయాలు తెలిసే విధంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే విధంగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని రూ. 50 వేల కోట్ల అభివృద్ధి సాధించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం రాయికల్ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ నాథ త్రికూటాలయంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.రాజాగౌడ్ తో కలిసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… జగిత్యాల జిల్లాలో పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో క్రీడా పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ చూపిన 180 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగిందన్నారు.త్రికూటాలయంలో రాయికల్ పట్టణ ప్రజల అవసరాల నిమిత్తం నిధులు కేటాయించి మంటపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, పర్యాటక, పురావస్తు శాఖ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో మాట్లాడి ప్రణాళికలకు అనుగుణంగా గుడికోటను అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయ కమిటీ వినతి పత్రం అందజేసిందని, దానికి అనుగుణంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.రైజింగ్ తెలంగాణ 2047లో భాగంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం కృషి చేస్తోందని, కొన్ని దేశాలు కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడి అభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు. పురాతన కట్టడాలను కాపాడుతూ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాయికల్ పెద్ద చెరువు జలకళతో ఉండడానికి గతంలో కృషి చేశామని, ముఖ్యమంత్రి సహకారంతో రూ. 1 కోటి నిధులతో పెద్ద చెరువు వద్ద సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, వైస్ చైర్మన్ సౌజన్య శ్రీధర్ రెడ్డి, కమిషనర్ మనోహర్ గౌడ్,పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు,మాజీ వైస్ చైర్మన్ రమాదేవి, డీఈవో రాము, డివైఎస్వో రవి, కౌన్సిలర్లు పల్లికొండ గంగాధర్, మౌనిక, మానస, శ్రీధర్,రాకేశ్ నాయక్, మచ్చ గంగలక్ష్మీ శేఖర్, కో-ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, మహేష్ గౌడ్, లత మురళి, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

