జయశంకర్ పార్కు అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలి
వాకింగ్ ట్రాక్ బురదమయం.. వ్యాయామ పరికరాలు మరమ్మతులు చేయాలి
భూపాలపల్లి, సెప్టెంబర్ 28( మన ప్రజావాణి ): పట్టణంలోని జయశంకర్ పార్కులో వాకింగ్ చేసే సింగరేణి విశ్రాంత కార్మికులు, పట్టణ యువత, వాకింగ్ ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే పార్కులోని వాకింగ్ ట్రాక్ బురదమయంగా మారుతుండటంతో నడక సాగించేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాకింగ్ ట్రాక్‌కు ఇరువైపులా ఉన్న నాళాలను సక్రమంగా ఏర్పాటు చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాల్లో చాలా వరకు పనిచేయడం లేదని, వాటిని వెంటనే మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త పరికరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే గారు, సింగరేణి జీఎం, మున్సిపల్ అధికారులు పార్కును పరిశీలించి సుమారు రూ.50 లక్షలతో పార్కును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. అయితే రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ సింగరేణి విశ్రాంత కార్మికులు, పట్టణ యువతతో పాటు అనేక మంది ప్రజలు ఈ పార్కును వాకింగ్, వ్యాయామం కోసం వినియోగిస్తున్నారని, ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే పార్కు విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని వారు కోరుతున్నారు.
ఎమ్మెల్యే, సింగరేణి అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే చొరవ తీసుకుని పార్కును పరిశీలించి, మంజూరైన అభివృద్ధి పనులను ఆలస్యం లేకుండా ప్రారంభించాలని సింగరేణి విశ్రాంత కార్మికులు, పట్టణ యువత, వాకింగ్ ప్రియులు కోరుతున్నారు.

