*గుడికోట త్రికూటాలయాన్ని పరిరక్షించండి*
*రాయికల్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి):*
రాయికల్ పట్టణంలోని చారిత్రక, ఆధ్యాత్మిక సంపద అయిన గుడికోట త్రికూటాలయాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి ఆదివారం గుడికోటలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ కు వినతిపత్రం అందజేశారు.ఒకే ప్రాంగణంలో పంచముఖ లింగేశ్వర స్వామి, శ్రీ కేశవనాథ స్వామి, సూర్యనారాయణ స్వామి కొలువైన ఈ ఆలయం అరుదైన శిల్పకళకు, చారిత్రక ప్రాధాన్యతకు నిలయమని, భక్తులు దీనిని దక్షిణ కాశీగా భావిస్తారని ఆయన తెలిపారు.అంతటి విశిష్టత ఉన్న ఆలయంలోని పురాతన కట్టడాలు, శిల్పాలు శిథిలావస్థకు చేరాయని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిధులు కేటాయించి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. వర్షాకాలంలో ఆలయ పరిసరాల్లో నీరు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఆలయ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ప్రహరీ గోడ, రక్షణ కంచె నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని, ఒక్క పూజారి మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఉన్నందున మరో పూజారిని నియమించాలని, జగిత్యాల, కోరుట్ల, ఇటిక్యాల, రామాజీపేట ప్రధాన రహదారులపై కళాతోరణాలు నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

