*కేసీఆర్ హయాంలో క్షణం పోని కరెంట్.. కాంగ్రెస్ పాలనలో గంటల తరబడి కోతలపై ప్రజల ఆగ్రహం*
*రాయికల్, సెప్టెంబర్ 23 (ప్రజావాణి):*
రాయికల్ పట్టణం, మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా అంతరాయంపై ప్రజల్లో తీవ్ర చర్చ, ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉండేదని, ఒక్క క్షణం కూడా కరెంట్ పోయేది కాదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.అలాంటిది ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రిపేర్ల పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు గంటల తరబడి కరెంట్ నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాయికల్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, కొన్ని చోట్ల సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు.దీంతో ఎండ వేడిమికి చిన్నారులు, వృద్ధులు, గృహిణులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రిజ్ లు, ఫ్యాన్లు, మోటార్లు పనిచేయకపోవడంతో హోటళ్లు, బట్టల దుకాణాలు, వెల్డింగ్, జిరాక్స్ సెంటర్ల వంటి చిరు వ్యాపారాలు స్తంభించి వ్యాపారులు నష్టపోతున్నారు. యాసంగి సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో పగటిపూట కరెంట్ లేక వ్యవసాయ మోటార్లు నడవక రైతులు పంట పొలాలకు నీరు పెట్టలేక ఆందోళన చెందుతున్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల చదువులకు కూడా ఆటంకం కలుగుతోంది.రిపేర్లు చేయాల్సి వస్త విడతల వారీగా చేయకుండా ఒకేసారి గంటల కొద్దీ కరెంట్ తీసివేయడం వల్ల సామాన్యుల జీవనం అస్తవ్యస్తమవుతోందని, విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చి, ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేపట్టాలని, కరెంట్ కోతలపై పునరాలోచించాలని ప్రజలు కోరుతున్నారు.

