నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నాగార్జున ప్రభుత్వ కళాశాలకు మరో అరుదైన ఘనత దక్కింది. విద్యారంగంలో అంకితభావంతో సేవలు అందిస్తున్న ఆర్ధికశాస్త్ర అధ్యాపకులు డా. డి. మునిస్వామి మరియు సూక్ష్మ జీవ శాస్త్ర అధ్యాపకులు బత్తిని నాగరాజు లకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘ఉత్తమ అధ్యాపకులు’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారాలను అందించారు. ఈ సందర్బంగా వారిద్దరినీ కళాశాల స్టాఫ్ క్లబ్ తరపున ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాబోధనలో నూతన పద్ధతుల అవలంబన, పరిశోధనలు మరియు ఉత్తమ ఫలితాలను సాధించడంలో వారు చూపిన ప్రతిభను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ అన్నారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ, తమకు లభించిన ఈ గుర్తింపు కళాశాల ప్రోత్సాహం తోటి అధ్యాపకులు మరియు విద్యార్థుల సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. ఈ పురస్కారం తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులోనూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పని చేస్తామని పేర్కొన్నారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్, డా. పరంగి రవి కుమార్, డా. అంతటి శ్రీనివాసులు, స్టాఫ్ క్లబ్ కార్యదర్శి సుధాకర్, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు ఈ ఇద్దరు ఉత్తమ అధ్యాపకులకు ఘనంగా అభినందనలు తెలిపారు.

