*ఇందిరమ్మ ఇళ్లపై అర్హుల ఎదురుచూపులు*
ఆంగోత్ తండాలో ఆరుగురికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్
మంచాల, (ప్రజావాణి ):సెప్టెంబర్ 16: ఆంగోత్ తండ గ్రామపంచాయతీలో గుడిసెల్లో. నివసిస్తున్న అర్హులైన ఆరుగురు నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఆరుగురు అర్హులుగా గుర్తించినట్లు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి డా. బాలకోటి నాయక్ తెలిపారు.
గతంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై నిర్వహించిన లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొని నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ, అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయించలేదని బాలకోటి నాయక్ ఆరోపించారు. సర్వేలో అర్హులుగా గుర్తించిన ఆరుగురిలో కేవలం ఇద్దరికే ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పడం వల్ల మిగిలిన అర్హుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గుడిసెల్లో నివసిస్తున్న నిజమైన అర్హులకు ఇళ్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆరుగురు అర్హులకూ ఇళ్లు మంజూరు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తామని డా. బాలకోటి నాయక్ తెలిపారు.

