📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఅంతర్జాతీయ జూడో ఎంపిక పోటీలకు మడికొండ గురుకుల విద్యార్థిని

అంతర్జాతీయ జూడో ఎంపిక పోటీలకు మడికొండ గురుకుల విద్యార్థిని

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయ జూడో ఎంపిక పోటిలకు మడికొండ గురుకుల విద్యార్థిని

మడికొండ హనుమకొండ సెప్టెంబర్ 4

 

క్రీడారంగంలో తెలంగాణ గురుకుల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. హనుమకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని జి. విద్య జూడో క్రీడలో అంతర్జాతీయ స్థాయి ఎంపిక పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

 

ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన 69వ జాతీయ స్థాయి పాఠశాలల క్రీడల్లో -63 కిలోల విభాగంలో జి. విద్య అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ ప్రదర్శన ఆధారంగా భారత పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఎంపిక పోటీలకు ఎంపికైన క్రీడాకారిణుల్లో ఆమె స్థానం సంపాదించింది.

 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లోని ఐఎస్‌ఎఫ్ జిమ్నాస్టిక్ హాల్‌లో నిర్వహించనున్న అండర్-18 జూడో బాలబాలికల సెలక్షన్ ట్రయల్స్‌లో జి. విద్య పాల్గొననుంది. ఈ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరగనున్న అంతర్జాతీయ జూడో పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనే అవకాశం పొందనున్నారు.

 

ఈ సందర్భంగా మడికొండ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి. జయశ్రీ, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని జి. విద్యతో పాటు జూడో కోచ్ నాయకపు నాగరాజును అభినందించారు.

 

ప్రిన్సిపాల్ జయశ్రీ మాట్లాడుతూ, కఠోర సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో జి. విద్య సాధించిన విజయం అభినందనీయమన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాల, జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

జూడో కోచ్ నాయకపు నాగరాజు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి నిరంతరం శిక్షణ, ప్రోత్సాహం అందిస్తున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాలలో జూడో క్రీడకు అవసరమైన పూర్తి స్థాయి వసతులు, పరికరాలు పరిమితంగా ఉన్నప్పటికీ, కఠోర శిక్షణతో విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.

 

ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి ఇంతటి అరుదైన అంతర్జాతీయ అవకాశానికి మార్గం సుగమం కావడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని వారు అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతిభావంతులైన క్రీడాకారులతో పోటీపడే అవకాశం తెలంగాణ గురుకుల విద్యార్థినికి రావడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గురుకులాల ప్రతిభను జి. విద్య చాటాలని అందరూ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.