📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

కులాల రాజ్యాధికారం కాదు—శ్రామిక ప్రజల రాజ్యాధికారమే ప్రత్యామ్నాయం
జంపన్న

బీసీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు వంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గం కాదు.వివిధ సామాజిక సెక్షన్లు. వీరికి ప్రత్యేకమైన సామాజిక సమస్యలు, వివక్షలు, అసమానతలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ప్రతి సామాజిక సెక్షన్ తన సమస్యలపై ప్రత్యేకంగా సంఘటితమై ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పోరాటాలు నిర్వహించడం అవసరం. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక గౌరవం వంటి సమస్యలు ఉన్నాయి. దళితులు కుల వివక్ష, అంటరానితనం, భూమి, ఉపాధి, సామాజిక అవమానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆదివాసీలు భూమి, అడవి, జీవన హక్కుల కోసం పోరాడాలి. మహిళలు పితృస్వామ్య వివక్ష, ఆర్థిక ఆధారపడటం, హింస, అసమాన అవకాశాలకు వ్యతిరేకంగా పోరాడాలి. విద్యార్థులు విద్యా హక్కు కోసం, నిరుద్యోగులు ఉపాధి కోసం, రైతులు భూమి, ఉత్పత్తి, గిట్టుబాటు ధర, అప్పుల సమస్యలపై పోరాడాలి. ఈ పోరాటాలు పరస్పరం విరుద్ధమైనవి కావు. ఒక సామాజిక సెక్షన్‌పై జరుగుతున్న అణచివేతను మరొక సెక్షన్ పట్టించుకోకపోతే సమగ్ర ప్రజాస్వామ్య సమాజం ఏర్పడదు. కాబట్టి ప్రత్యేక సామాజిక సమస్యలపై పోరాటాలను బలహీనపరచడం కాదు; వాటిని విస్తృతమైన సమానత్వ, సామాజిక న్యాయ, ప్రజాస్వామ్య ఉద్యమంతో అనుసంధానం చేయడం అవసరం.

అయితే ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న ముందుకు వస్తుంది. బీసీల రాజ్యాధికారం, దళితుల రాజ్యాధికారం, మహిళల రాజ్యాధికారం, ఆదివాసీల రాజ్యాధికారం, రైతుల రాజ్యాధికారం అంటూ ప్రతి సామాజిక సెక్షన్‌కు విడివిడిగా రాజ్యాధికార లక్ష్యాలను నిర్ణయించడం శ్రామిక ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది. ఎందుకంటే ప్రతి సామాజిక సెక్షన్‌లోనూ అంతర్గత ఆర్థిక విభజన ఉంది. బీసీలలో శ్రమ దోపిడీకి గురయ్యే పేదలు, కార్మికులు, చిన్న రైతులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కొద్దిమంది సంపన్నులు, పెట్టుబడిదారులు, ఆస్తి కలిగినవారు కూడా ఉన్నారు. అదే పరిస్థితి దళితులు, ఆదివాసీలు, రైతులు, మహిళలు వంటి సెక్షన్లలో కూడా కనిపిస్తుంది. అలాగే చారిత్రకంగా అగ్రకులాలుగా పిలవబడే సామాజిక సమూహాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆధిపత్యం కలిగిన వర్గాలు బలంగా ఉన్నప్పటికీ, ఆ సమూహాల్లో కూడా పెద్ద సంఖ్యలో శ్రమపై ఆధారపడే పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. కాబట్టి కులం ఒకటే వర్గం కాదు; సామాజిక సెక్షన్ ఒకటే వర్గ ప్రయోజనాన్ని కలిగి ఉండదు.

ఇక్కడ మార్క్సిస్టు దృష్టి అత్యంత కీలకం. భారతదేశంలో కులం, లింగం, ప్రాంతం, జాతి, మతం, విద్య, ఉపాధి వంటి అనేక రూపాల్లో అణచివేత, వివక్ష కొనసాగుతున్నప్పటికీ, వాటి మధ్య నుంచి శ్రమ దోపిడీకి గురయ్యే కోట్లాది ప్రజలను గుర్తించాలి. ఈ ప్రజలందరి సమస్యలు ఒకేలా ఉండవు; కానీ శ్రమ దోపిడీకి, సామాజిక అణచివేతకు, వివక్షకు గురవుతున్న ప్రజల ప్రయోజనాల్లో ఒక విస్తృతమైన ఐక్యతకు భౌతిక పునాది ఉంది. ఆ ఐక్యత కుల భేదాలను లేవని తిరస్కరించడం ద్వారా కాదు; కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ, అదే సమయంలో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వారందరినీ సంఘటితం చేయడం ద్వారా నిర్మించాలి.
కాబట్టి బీసీ సమస్యను బీసీలకే, దళిత సమస్యను దళితులకే, మహిళా సమస్యను మహిళలకే పరిమితం చేయడం చివరికి ప్రతి పోరాటాన్ని ప్రత్యేక గోడల మధ్య బంధిస్తుంది. కులానికి ఒక రాజ్యాధికారం, మహిళలకు ఒక రాజ్యాధికారం, ఆదివాసీలకు మరో రాజ్యాధికారం అంటూ శ్రామిక ప్రజలను విభజిస్తే, ఆ విభజన నుంచి లాభపడేది శ్రామిక ప్రజలు కాదు—ప్రస్తుత పాలకవర్గాలే. సామాజిక సెక్షన్ల ప్రత్యేక పోరాటాలు అవసరం; కానీ వాటి అంతిమ రాజకీయ దిశ సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, శ్రమ విముక్తి, శ్రామిక రాజ్యాధికారం వైపు ఉండాలి.

ప్రతి సెక్షన్ తన ప్రత్యేక హక్కుల కోసం పోరాడాలి; అన్ని సెక్షన్ల శ్రమజీవులు తమ ఉమ్మడి విముక్తి కోసం ఐక్యంగా పోరాడాలి. ఇదే విభజనను అధిగమించే మార్గం; ఇదే పాలకవర్గాలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల నిజమైన రాజకీయ శక్తిని నిర్మించే మార్గం.

జంపన్న
డెమోక్రటిక్ సోషలిస్ట్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.