తొర్రూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కరించాలి అని కోరుతూ తొర్రూరు మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధి బృందం ఆదివారం వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ను కలిసి వినతిపత్రం అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం తొర్రూరు మండల శాఖ అధ్యక్షుడు ఇట్టే సోమారెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కోరుతున్నామని, అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా, రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నూరు కోటయ్య, దీకొండ వీరభద్రం, ఆర్థిక కార్యదర్శి బోడ బాలాజీ, గట్టు సోమయ్య తదితరుల ప్రతినిధి బృందం వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్యను ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకం కలిసి వారి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు అందించి పరిష్కారానికి సహకరించాలని వారు కోరారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగుల సౌకర్యం కోసం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సబ్ ట్రెజరీ ఆఫీస్, అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు ఈ వినతిపత్రంలో ఎంపీ విన్నవించారు. అలాగే తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిర్మించిన తమ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం అభివృద్ధి పనుల కోసం కూడా సహకరించాలని వారు ఎంపీ నీ అభ్యర్థించారు.

