ఈరోజు మంగళవారం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని బుగులోని దేవాలయం సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో “మన అడవి – మన భవిష్యత్తు, పచ్చదనం పెంచడం – ప్రాణాలను కాపాడుదాం” అనే నినాదంతో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రసత్యనారాయణ రావు గారు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు.కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి జిల్లా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరియు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మొక్కలు నాటిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి మనకు అమూల్యమైన వరమని, అడవులు మరియు చెట్లు మానవ జీవనానికి ప్రాణాధారమని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపు కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని,మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి ,జిల్లా అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్ గ్రామ ఉపసర్పంచ్ ఆకుతోట తిరుపతి గ్రామ కమిటీ అధ్యక్షులు నిమ్మల విజేందర్ నాయకులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

