రసాభాసగా ఇంద్రానగర్‌లో రోడ్డు వెడల్పు పనులు

ఒకవైపే రోడ్డు తొలగిస్తున్నారంటూ కాలనీవాసుల ఆగ్రహం
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో గురువారం ఉదయం రోడ్డు వెడల్పు పనులు రసాభాసగా మారాయి. రోడ్డు విస్తరణలో అధికారులు, కాంట్రాక్టర్ ఒకవైపు మాత్రమే రోడ్డు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
రోడ్డు వెడల్పు చేయాలంటే ఇరువైపులా సమానంగా స్థలం తీసుకోవాల్సి ఉండగా, కాంట్రాక్టర్ ఒకవైపునే పనులు చేపడుతున్నారని కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అదే సమయంలో అక్కడికి చేరుకున్న మేడ్చల్ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అధికారులు, కాలనీవాసులతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేశారు. అయితే అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో స్థానికులకు, అధికారులకు మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది.
స్థానికుల అభ్యంతరాలను పట్టించుకోకుండానే అధికారులు రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు విషయంలో అందరికీ సమానంగా న్యాయం చేయాల్సిన అధికారులు ఒకవైపు వారికి మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇరువైపులా సమానంగా రోడ్డు విస్తరణ చేపట్టాలని, లేదంటే రోడ్డు పనులు చేపట్టవద్దని కాలనీవాసులు డిమాండ్ చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

