భూ భారతి సెగ.. కాస్తుదారులకు వెన్నుపోటు.. పాత రికార్డుల పేరిట భూ బకాసురుల కబ్జాలు!
ధరణి హయాంలోనే కాస్తు కాలం తొలగింపు.. భూభారతిలో పాత పట్టాదారుల పేరుపై రికార్డు నమోదు
అక్రమార్కుల స్క్రీన్ ప్లే.. దొంగ కేసులు
ఉత్సవ విగ్రహంల మారిన ప్రజావాణి కార్యక్రమం.. స్పందించని యంత్రాంగం
అధికారుల చుట్టూ తిరిగి బాధితుల చెప్పుల జోడీలు మారుతున్నాయి తప్ప.. వారికి ఒరిగిన న్యాయం ఏమీ లేదు!
భూభారతి సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు స్పందించాలి
చెన్నారావుపేట ఆగస్టు 26 ప్రజావాణి
నమ్ముకున్న నేలతల్లే పరాయదవుతుంటే దశాబ్దాలుగా ఆ భూమిని నమ్ముకుని రికార్డులో ఉన్న కాస్తుదారులు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి రికార్డులలో దొర్లిన సాంకేతిక లోపాలు, ధరణి హయంలోనే సాగుబడి (కాస్తు) కాలాన్ని తొలగించడం నిజమైన రైతులకు శాపంగా మారింది. భూములను మళ్లీ పాత పట్టదారుల పేరిట నమోదు చేయడంతో, క్షేత్రస్థాయిలో అసలు కాస్తుదారుల హక్కులు గాల్లో దీపాల్ల మారాయి.
అక్రమార్కుల స్క్రీన్ ప్లే.. దొంగ కేసులు
రికార్డుల్లోని లొసుగులనే ఆసరాగా చేసుకుని భూ కామంధులు రెచ్చిపోతున్నారు. తాజా కాగితాలను చూపిస్తూ సాగుదారులను భయభ్రాంతులకు గురిచేసి భూములను లాక్కోవడమే కాకుండా అక్రమ అమ్మకాలకు తెరలేపారు. ప్రశ్నించిన వారిపై మహిళలను ముందుంచి దొంగ కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
ప్రజావాణి కేవలం కాగితాలకేనా?
భూమి చేజారిపోతుందన్న ఆందోళనతో బాధితులు ప్రతివారం ఆర్డిఓ కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన స్పందన కరువు అవడంతో ప్రజావాణి ‘కార్యక్రమం ఉత్సవ విగ్రహంలా మారిందని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముడుపుల మత్తులో యంత్రాంగం?
అన్ని ఆధారాలు చూపిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల అండదండలతోనే కబ్జాదారులు సైతం “మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు” అంటూ వీర్రవీగుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరిపి కాస్తుదారుల హక్కులను కాపాడాలని అనుభవదారు కాస్తు రికార్డు కోల్పోయిన మండల రైతులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

