ఘట్కేసర్, ఆగస్టు 9: ఘట్కేసర్లో అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఆదివారం ఉదయం ఘట్కేసర్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో అంబేద్కర్ విగ్రహం సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తరలిస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా, అందులో సుమారు 38 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఏ1 నాగరాజు, ఏ2 చంద్రశేఖర్, ఏ5 తరుణ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ రవాణా వ్యవహారంలో మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు గుర్తించామని, వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
ఈ కేసులో ఒక అశోక్ లేలాండ్ డోస్ట్ ఆటో, 38 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా సేకరించడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఘట్కేసర్ పోలీసులు హెచ్చరించారు.
