📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఈ ప్రపంచాన్ని కలిపి ఉంచే ఒకే ఒక బంధం స్నేహం

ఈ ప్రపంచాన్ని కలిపి ఉంచే ఒకే ఒక బంధం స్నేహం

📰 Generate e-Paper Clip

ఈ ప్రపంచాన్ని కలిపి ఉంచే ఒకే ఒక బంధం స్నేహం

 

స్నేహం అనేది రెండు మనసులు కలిసే ఒక అందమైన బంధం. అమ్మ ప్రేమలా ఆప్యాయతను పంచే పవిత్రమైన అనుబంధం. “మట్టిలో ఆడుకునే చిన్ననాటి నుంచి మట్టిలో కలిసిపోయే చివరి క్షణం వరకు కల్మషం లేకుండా నిలిచేది నిజమైన స్నేహం.”

 

ఈ ప్రపంచంలో అమ్మ తర్వాత మన సంతోషాలను, బాధలను, విజయాలను, వైఫల్యాలను ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోగలిగేది ఒక నిజమైన స్నేహితుడే. స్నేహంలో పగ, ప్రతీకారం, స్వార్థం ఉండవు. ప్రేమ, నమ్మకం, త్యాగం మాత్రమే ఉంటాయి. స్నేహితుడు కష్టంలో ఉంటే అతని కోసం ఏదైనా చేయాలనిపించడం నిజమైన స్నేహానికి నిదర్శనం.

 

కొన్నిసార్లు ఇంట్లో కూడా చెప్పుకోలేని విషయాలను స్నేహితుడితో పంచుకుంటే మనసులోని భారం సగం తగ్గిపోతుంది. ప్రపంచమంతా ఒకవైపు నిలిచినా, నిజమైన స్నేహితుడు మాత్రం నీ పక్కనే నిలబడతాడు. అందుకే స్నేహితుడు మనం ఎంచుకునే కుటుంబ సభ్యుడిలాంటివాడు.

 

చిన్నప్పటి ఆటలు, అల్లర్లు, కొట్లాటలు, అలకలు—అన్నీ కల్మషం లేని స్వచ్ఛమైన స్నేహానికి గుర్తులు. యుక్తవయసులో ఆ స్నేహం మరింత బలపడుతుంది. నిజమైన స్నేహితుడి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే మనసు కలుగుతుంది. అవసరమైతే తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టగలిగే వ్యక్తి నిజమైన స్నేహితుడు.

 

పుట్టుకతో మనకు కుటుంబం అనే రక్తసంబంధం లభిస్తుంది. కానీ రక్తసంబంధం లేకపోయినా, మనమే ఎంచుకుని జీవితాంతం మనతో ఉండే బంధం స్నేహం. అలాంటి మంచి స్నేహితుడు దొరకడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు; అది నిజంగా ఒక అదృష్టం.

 

నిజమైన స్నేహితుడు మన తప్పును పదిమంది ముందు కప్పిపుచ్చి మన గౌరవాన్ని కాపాడతాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అదే తప్పును నిర్మొహమాటంగా చెప్పి, సరైన మార్గంలో నడిపిస్తాడు. అదే నిజమైన స్నేహం గొప్పతనం.

 

నిజమైన స్నేహానికి ధనం, హోదా, కులం, మతం, ప్రాంతం అనే భేదాలు ఉండవు. ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం, పరస్పర గౌరవం, ఆప్యాయత మాత్రమే ఆ బంధాన్ని శాశ్వతంగా నిలబెడతాయి. కాలం మారినా, పరిస్థితులు మారినా, దూరాలు పెరిగినా మనసులు కలిసే ఉంటే ఆ స్నేహం ఎప్పటికీ చెదరదు.

 

జీవితంలో ఎన్నో పరిచయాలు వస్తాయి, చాలా మంది వెళ్లిపోతారు. కానీ మన కష్టసుఖాల్లో తోడుగా నిలిచి, మన విజయాన్ని తన విజయంగా భావించి, మన బాధను తన బాధగా అనుభవించే వ్యక్తి మాత్రమే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని సంపాదించడం ఒక వరం, ఆ స్నేహాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.

 

స్నేహం అనేది కేవలం ఒక పదం కాదు; అది జీవితానికి బలం, మనసుకు ధైర్యం, కష్టకాలంలో ఓదార్పు, విజయానికి ప్రేరణ. నిజమైన స్నేహితుడు ఉన్న జీవితంలో ఒంటరితనం ఉండదు. అతడు మన జీవిత ప్రయాణంలో ఎప్పటికీ మరచిపోలేని తోడు.

 

“ఈ ప్రపంచాన్ని ప్రేమతో, నమ్మకంతో కలిపి ఉంచే గొప్ప బంధం స్నేహం. స్నేహితులను సంపాదించడం గొప్ప విషయం కాదు, జీవితాంతం ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన గొప్పతనం. నిజమైన స్నేహితుడు జీవితంలో దొరకడం ఒక వరం, ఆ వరాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం.” ఇనుగాల దిలీప్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.