📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialజైపూర్ మండలంలో భారీ వర్షాలు

జైపూర్ మండలంలో భారీ వర్షాలు

📰 Generate e-Paper Clip

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో, ఎంపీఓ పిలుపు

జైపూర్, జూలై 29,ప్రజావాణి:

గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జైపూర్ మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని ఎంపీడీవో జి.సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) శ్రీపతి బాపురావు కోరారు. బుధవారం మండలంలోని పలు వర్ష ప్రభావిత గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.

**స్తంభించిన రాకపోకలు – రంగంలోకి దిగిన యంత్రాంగం**

భారీ వర్షాల వల్ల మండలంలోని రసూల్‌పల్లె వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రోడ్డుపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి స్పందించి, జేసీబీ సాయంతో నీరు సజావుగా సాగిపోయేలా ఏర్పాట్లు చేశారు.మరోవైపు టేకుమట్ల, కుందారం పెద్దవాగులు వంతెనల పైనుంచి ప్రవహిస్తుండటంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. పంచాయతీ సిబ్బందితో కలిసి వంతెనల ఇరువైపులా ప్లాస్టిక్ జాలీలను రక్షణగా ఏర్పాటు చేసి, ప్రయాణికులను అడ్డుకున్నారు. మత్స్యకారులు, గ్రామస్థులు ఎవరూ గోదావరి పరిసర ప్రాంతాలకు గానీ, చెరువుల వద్దకు గానీ వెళ్లరాదని అధికారులు గట్టిగా హెచ్చరించారు.

**లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి**

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రానున్న రెండు, మూడు రోజుల పాటు మండలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు మారాలని, పాతబడిన ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది నిరంతరం స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని కోరారు.ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులతో పాటు టేకుమట్ల సర్పంచ్ బల్ల వెంకటేష్, ముదిగుంట సర్పంచ్ ఆకుల రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు టి.శ్రీనివాస్, పి.సురేష్, ఎల్.ప్రశాంత్, ఎం.విష్ణువర్ధన్ , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.