📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలి.. భూ బాధితులకు న్యాయం జరగాలి: కొమ్మిడి విక్రాంత్ రెడ్డి

ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలి.. భూ బాధితులకు న్యాయం జరగాలి: కొమ్మిడి విక్రాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూలై 19: ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి భూ బాధితులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని బీజేవైఎం ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘట్కేసర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు ముందే ప్రారంభమైన ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం విచారకరమన్నారు. భూ సేకరణలో నష్టపోయిన కుటుంబాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, పలువురు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘట్కేసర్ పర్యటన సందర్భంగా ప్రజల అత్యవసర సమస్యలకు బదులుగా ఇతర నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వడం బాధాకరమని విమర్శించారు. కోట్ల రూపాయల నిధులతో ఇతర కార్యక్రమాలు చేపట్టే ముందు ప్రజల ప్రాణాలు, జీవనోపాధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

స్వర్గీయ ప్రజాకవి అందెశ్రీ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలపై స్పందిస్తూ, ఆయన పేరును రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం సముచితం కాదన్నారు. అదే నిధులతో రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి, భూ బాధితులకు న్యాయం చేసి ఉంటే అది అందెశ్రీకి నిజమైన నివాళిగా నిలిచేదని అభిప్రాయపడ్డారు.

భూ బాధితులు ముఖ్యమంత్రి సభకు వెళ్లకుండా అడ్డుకునేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని, శాంతియుతంగా వినతిపత్రం అందజేయాలన్న ప్రయత్నాలను కూడా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఘట్కేసర్ ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు తాను కార్యక్రమ స్థలానికి వెళ్లగా తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విక్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇలాంటి చర్యలకు భయపడబోనని, భూ బాధితులకు న్యాయం జరిగే వరకు, ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజల తరఫున తన ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.