📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్లలో ‘ప్రైవేట్’ దోపిడీ: పుస్తకాలు,ఫీజుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీ కత్తెర! నిబంధనలకు పాతరేస్తూ అడ్డగోలు వసూళ్లు
–  పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.ఆందోళనలో పేద,మధ్యతరగతి తల్లిదండ్రులు!
పోరుమామిళ్ల, జూన్ 22  మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చేసి,విద్యా హక్కు చట్టాన్ని నిలువునా పాతరేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతోనే, ఫీజుల దందాకు తెరలేపాయి.ఒక పక్క ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని చెబుతున్నా,ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్లకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో కోచింగ్ అంటూ రంగురంగుల బ్రోచర్లు,ఆకర్షణీయమైన ప్రకటనలతో తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ వేలల్లో ఫీజులు గుంజుతున్నారు.కార్పొరేట్ ఫీజులను మించిపోతున్న‘బుక్స్’ ధరలు!ఈ ఏడాది పుస్తకాలు, నోట్ బుక్స్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకూడదు.కానీ పోరుమామిళ్ల మండలంలోని మెజారిటీ ప్రైవేట్ పాఠశాలలు తామే స్వయంగా కౌంటర్లు పెట్టి మరీ పుస్తకాలు,యూనిఫాంలు,షూస్,బెల్టులు విక్రయిస్తున్నాయి.కొన్ని స్కూళ్లు తాము సూచించిన నిర్దేశిత దుకాణాల్లోనే (సిండికేట్ వెండర్స్) కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.బయట మార్కెట్లో ₹1,500 నుండి ₹2,000 లభించే పుస్తకాల సెట్‌ను,స్కూల్ యాజమాన్యాలు ప్రైవేట్ పబ్లిషర్స్ లోగోలతో ముద్రించి ₹8,000 నుండి ₹12,000 వరకు అమ్ముతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.ఒక్కో విద్యార్థి పుస్తకాల కోసమే వేల రూపాయలు వెచ్చించాల్సి రావడంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది.ఫీజుల స్ట్రక్చర్‌లో మాయాజాలం – ముక్కుపిండి వసూళ్లు,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల తమ ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలి.కానీ ఇక్కడి ప్రైవేట్ స్కూళ్లలో ఆ ఊసే లేదు.ట్యూషన్ ఫీజు: ₹20,000 నుండి ₹30,000,అడ్మిషన్ ఫీజు: కొత్తగా చేరే పిల్లలకు దరఖాస్తు,అడ్మిషన్ పేరిట అదనంగా ₹5,000 నుండి ₹10,000 ఇతర చార్జీలు: డిజిటల్ క్లాస్ రూమ్స్,ఏసీ చార్జీలు,ల్యాబ్ ఫీజు,స్పోర్ట్స్ ఫీజుల పేరిట మరో ₹10,000 వసూలు చేస్తున్నారు.ఫీజు చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా పెనాల్టీలు విధిస్తూ,విద్యార్థులను క్లాసుల బయట నిలబెడుతూ మానసిక వేధింపులకు గురిచేస్తున్న ఉదంతాలు కూడా మండలంలో వెలుగుచూస్తున్నాయి.తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతో తల్లిదండ్రులు బయటకు చెప్పుకోలేక,అవసరాల కోసం వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ ఫీజులు కడుతున్నారు.నిబంధనలు కాగితాలకే పరిమితం!ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ స్కూళ్లు కేవలం ఎస్సీఈఆర్‌టీ (SCERT) లేదా ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) సిలబస్ పుస్తకాలను మాత్రమే సూచించాలి.కానీ కమిషన్ల కక్కుర్తి కోసం ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను రుద్దుతున్నారు.స్కూల్ ప్రాంగణాల్లో వాణిజ్య విక్రయాలు జరపడం చట్టరీత్యా నేరమని తెలిసినా,పోరుమామిళ్లలో యథేచ్ఛగా దుకాణాలు నడుస్తుండటం వెనుక విద్యాశాఖ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.తనిఖీలు చేయాల్సిన మండల విద్యాశాఖ అధికారులు (MEO) కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.”రెక్కాడితే గాని డొక్కాడని మా బతుకుల్లో పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ప్రైవేట్ స్కూల్లో చేర్చాము.కానీ అడ్మిషన్ ఫీజు,బిల్డింగ్ ఫీజు,టర్మ్ ఫీజు అంటూ రకరకాలుగా బాదుతున్నారు. వీటికి తోడు పుస్తకాలు,బట్టలు కూడా వాళ్ల దగ్గరే కొనాలంటున్నారు. బయట కొంటామంటే కుదరదంటున్నారు.ఇంత దారుణంగా దోచుకుంటున్నా అడిగే నాథుడే లేడు.పోరుమామిళ్ల మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న ఈ విద్యా వ్యాపారానికి తక్షణమే బ్రేక్ వేయాలి.జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలి.1.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలి.2.స్కూల్స్ లోపల పుస్తకాలు,యూనిఫామ్స్ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలి.3.పేరెంట్స్ కమిటీల సమక్షంలో ఫీజుల నియంత్రణ కమిటీ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలి.ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ స్కూళ్ల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో విద్యార్థి సంఘాలు,తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.