📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaవేసవి తీవ్రత దృష్ట్యా డంపింగ్ యార్డు లో ఎట్టి పరిస్థితుల్లోనూ మంటలు, పొగలు రాకుండా చర్యలు...

వేసవి తీవ్రత దృష్ట్యా డంపింగ్ యార్డు లో ఎట్టి పరిస్థితుల్లోనూ మంటలు, పొగలు రాకుండా చర్యలు తీసుకోవాలి – కమిషనర్ బి. శరత్ చంద్ర

📰 Generate e-Paper Clip

*వేసవి తీవ్రత దృష్ట్యా డంపింగ్ యార్డు లో ఎట్టి పరిస్థితుల్లోనూ మంటలు, పొగలు రాకుండా చర్యలు తీసుకోవాలి – కమిషనర్ బి. శరత్ చంద్ర*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. శరత్ చంద్ర సోమవారం నగరంలోని రిసోర్స్ పార్క్ (డంపింగ్ యార్డు)ను ఆకస్మికంగా పరిశీలించారు. డంపింగ్ యార్డులో కొనసాగుతున్న బయోమైనింగ్ పనులు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, పొగ నియంత్రణ పరిస్థితులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్తీక్, అసిస్టెంట్ ఇంజనీర్ అసీమ్ బాబా, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్. ప్రదీప్ రెడ్డి, డంపింగ్ యార్డు ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శశిధర్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఎండలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా డంపింగ్ యార్డులో మంటలు, పొగలు ఏర్పడుతున్న నేపథ్యంలో కమిషనర్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డులో మంటలు చెలరేగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, వాటర్ ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీటిని చల్లి పొగలు, మంటలను పూర్తిస్థాయిలో అదుపులో ఉంచాలని ఆదేశించారు. అలాగే ఇటీవల త్రవ్వించిన కొత్త బోర్‌వెల్‌కు తక్షణమే మోటార్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి నీటిని తీసుకుని డంపింగ్ యార్డులో వినియోగించాలనీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఎటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిసోర్స్ పార్క్‌లో ప్రస్తుతం సుమారు 65 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉండగా, అందులో 14 వేల మెట్రిక్ టన్నుల బయోమైనింగ్ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు కమిషనర్ గారికి వివరించారు. బయోమైనింగ్ ఏజెన్సీ “రేకార్ట్” ప్రతినిధులకు పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. డంపింగ్ యార్డు పరిసర ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని, నగర పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్తీక్, అసిస్టెంట్ ఇంజనీర్ అసీమ్ బాబా, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్. ప్రదీప్ రెడ్డి, డంపింగ్ యార్డు ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శశిధర్, బయోమైనింగ్ ఏజెన్సీ ప్రతినిధులు, మున్సిపల్ ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.