*స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండేకు ఘన నివాళులు*
* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 19
దేశ ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి వేడుకలను రిటైర్డ్ ఆర్మీ జవాన్, ప్రస్తుత సింగరేణి ఏరియా ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ కుమార్ పివ్హాల్, ఆయన సతీమణి రాణి పివ్హాల్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని వారి నివాసంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముందుగా మంగళ్ పాండే చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం రాజేష్ పివ్హాల్, రాణి పివ్హాల్ లు మాట్లాడుతూ,
ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో జన్మించిన మంగళ్ పాండే 1857 సిపాయిల తిరుగుబాటుకు ఆద్యుడని, బ్రిటిష్ పాలనపై తొలిసారి సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడని కొనియాడారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సైన్యంలోని 34వ బెంగాల్ స్థానిక పదాతిదళంలో సైనికుడిగా పనిచేసిన ఆయన, ఆవు, పంది కొవ్వుతో తయారైనట్లు ఆరోపణలు ఉన్న ఎన్‌ఫీల్డ్ తూటాలను ఉపయోగించడానికి నిరాకరించారని తెలిపారు. మార్చి 29, 1857న బరాక్‌పూర్‌లో బ్రిటిష్ అధికారులపై హవాల్దార్ మాత దిన్ వాల్మీకితో కలిసి తిరుగుబాటు జెండా ఎగురవేశారని గుర్తుచేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు స్ఫూర్తినిచ్చిన గొప్ప దేశభక్తుడని, ఈ కారణంగా ఏప్రిల్ 8, 1857న బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ఉరితీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు, నేటి తరానికి స్వాతంత్ర్య సమరయోధుల పోరాట గాథలు తెలియజేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి, వారిలో దేశభక్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండేకు ఘన నివాళులు
RELATED ARTICLES




