*సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అంశంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్*
*తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర ఆదేశాలు*
*15 రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించిన జాతీయ ఎస్సీ కమిషన్*
*రైతుల తరఫున ఢిల్లీ వరకు పోరాటం చేసిన షాద్ నగర్ బీజేపీ నేతల చొరవ ఫలితం*
షాద్ నగర్ ప్రజావాణి జూలై 30:
రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత జీహెచ్ఎంసీ ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) కేంద్రం ఏర్పాటుపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) స్పందించింది. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన పట్నం సురేష్ సమర్పించిన ఫిర్యాదును పరిశీలించిన కమిషన్, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూకు అధికారిక లేఖ పంపింది.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ప్రకారం, ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ వల్ల షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు, చిన్న రైతుల భూములు, జీవనోపాధి, ఆరోగ్యం, రాజ్యాంగ హక్కులు దెబ్బతినే అవకాశం ఉందని కమిషన్ పేర్కొంది. ఈ అంశం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామ్‌చందర్ సంతకంతో జారీ చేసిన లేఖలో, సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విచారణ అనంతరం తీసుకున్న చర్యలు, సంబంధిత ఆధారాలతో కూడిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్)ను 15 రోజుల్లోగా కమిషన్‌కు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
*బీజేపీ నేతల చొరవతో ఢిల్లీ వరకు రైతుల పోరాటం*
సిద్ధాపూర్ రైతుల సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో బీజేపీ షాద్‌నగర్ సీనియర్ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య కీలక పాత్ర పోషించారు. రైతులకు అండగా నిలిచి, వారిని ఢిల్లీకి తీసుకెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసి సమస్యను వివరించేలా సహకరించారు. వారి చొరవ, సమన్వయం ఫలితంగానే కమిషన్ వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లేఖ ప్రతులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శికి కూడా పంపినట్లు లేఖలో పేర్కొన్నారు.
సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు రావడంతో, ప్రభుత్వం తీసుకోనున్న తదుపరి చర్యలపై రైతులు, గ్రామస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ అంశంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్
RELATED ARTICLES




