పోరుమామిళ్ల,జూన్ 24ప్రజావాణి (రంగసముద్రం పంచాయతీ):ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి,గ్రామాలను ప్రగతి పథంలో నడపడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన’గ్రామ సచివాలయం’ వ్యవస్థ ఆశయాలు ఇక్కడ నీరుగారిపోతున్నాయి.వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ఈ దారుణ దృశ్యం.గ్రామ సచివాలయం కార్యాలయానికి కూతవేటు దూరంలో,సమీపంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది.నిత్యం అధికారులు,ప్రజాప్రతినిధులు తిరిగే ప్రధాన కూడలిలోనే ఈ దుస్థితి ఉండటం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.అధికారుల ముక్కుల ముందే పందుల సామ్రాజ్యం!ప్రభుత్వ కార్యాలయం పక్కనే ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం ఒక బహిరంగ డంపింగ్ యార్డ్‌గా మార్చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు,కుళ్లిన ఆహార పదార్థాల మధ్య పందులు స్వైరవిహారం చేస్తూ,చెత్తను రోడ్డుపైకి లాగుతున్నాయి.సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు,ఆ దారిన వెళ్లే వాహనదారులు ముక్కులు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది.దుర్వాసనతో కూడిన ఈ వ్యర్థాల వల్ల దోమలు,ఈగలు విపరీతంగా పెరిగిపోయి,స్థానికులు తీవ్ర అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కళ్లెదుటే ఇంత ఘోరం జరుగుతున్నా సచివాలయ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
ఫ్లెక్సీల హడావుడి.. పనుల్లో శూన్యం!
ఇదే వ్యర్థాల కుప్ప వెనుక గోడలపై రాజకీయ నాయకులు, స్థానిక యువనేతల (చిత్తా గారి ప్రణీత్ రెడ్డి టీమ్ వంటి) భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.ఫ్లెక్సీలపై ఉన్న ఫొటోల్లో నవ్వుతూ కనిపించే నాయకులకు,వారి కళ్లముందే ఉన్న ఈ చెత్త కుప్పలు కనిపించకపోవడం గమనార్హం.”బోర్డులు పెట్టడంపై, ప్రచార ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ.ఊరిని,ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను శుభ్రంగా ఉంచడంపై లేదా?”అని స్థానికులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
కళ్ళు తెరిచేది ఎన్నడు?
గ్రామ సచివాలయంలో పారిశుధ్య పర్యవేక్షణ కోసం ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పటికీ,వారు ఏమాత్రం స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సచివాలయం పరిసరాల్లో ఉన్నఈ చెత్త కుప్పలను తొలగించి, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని రంగసముద్రం గ్రామ ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
సచివాలయం కళ్లెదుటే.నరకకూపంగా ‘రంగసముద్రం’ పందుల స్వైరవిహారం అధికారుల ముక్కుల ముందే అస్తవ్యస్త పారిశుధ్యం..స్థానికుల తీవ్ర ఆగ్రహం!
RELATED ARTICLES




