
పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం రూ.25 లక్షలు డిమాండ్ చేశారని సంచలన వ్యాఖ్యలు!
న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆవేదన!
అమరావతి,జూన్ 11 ప్రజావాణి విజయవాడకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ శేఖర్ తనను భారీగా మోసం చేశాడని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆరోపించారు. వైన్ షాపుల లైసెన్సులు, వివిధ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికి తన వద్ద నుంచి విడతల వారీగా రూ.కోటికి పైగా తీసుకుని మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసే అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని చెప్పి మరో రూ.25 లక్షలు డిమాండ్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. పలుమార్లు డబ్బులు తీసుకున్నప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేశాడని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై పలువురిని ఆశ్రయించినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని, తనకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. న్యాయం జరక్కపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఆరోపణలపై విజయ్ శేఖర్ లేదా జనసేన పార్టీ నాయకత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.




