చిలుకూరు మార్చి 27(ప్రజావాణి)*చిలుకూరు మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చిలుకూరు మండల కేంద్ర కోదాడ- హుజూర్నగర్ రహదారిపై స్థానిక ప్రజలకు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమం నందు కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రోడ్డు ప్రమాదాలు నివారించటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వాహనాలపై వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కవద్దని ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. రహదారులపై పెద్ద వాహన డ్రైవర్లు అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని రోడ్డుపై పరిస్థితులను అంచనా వేయాలని చుట్టూ గమనిస్తూ ఉండాలని కోరారు. ప్రజలకు,వాహనదారులకు అసౌకర్యం కలిగించకుండా నిదానంగా వాహనాలు నడపాలని తెలిపారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదని దీనివల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోతారని,చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల అవగాహన లేక వాహనాలు వేగంగా నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని క్షతగాత్రులు అవుతున్నారని మృత్యువాత పడుతున్నారని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కార్లు ఇతర పెద్ద వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని కోరారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు బారి నుండి రక్షణ పొందవచ్చు అని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ హనుమాన్ నాయక్ పోలీస్ సిబ్బంది స్థానిక పౌరులు పాల్గొన్నారు.


