బెజ్జంకి, జూన్ 14(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కళ్ళేపల్లి గ్రామానికి చెందిన పబ్బతి ఆశీర్వాద్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని దవడ ఎముకలు విరగడంతో పాటు కుడి కన్ను చూపు కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్లోని ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆశీర్వాద్ వైద్య ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో అతని కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్తులు, దాతలను కోరుతున్నారు.ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. కళ్ళేపల్లి సర్పంచ్ బిగుళ్ల మోహన్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.ఈ కార్యక్రమంలో దుబ్బసి కృష్ణ, ప్రశాంత్ యాదవ్, కంకణాల రాజు, ఉత్కం రమేష్, మారుపాక ఎల్లయ్య, గుంటి శ్రీనివాస్, అబ్దుల్ కలాం, జుట్టు రమేష్, మహమ్మద్ అయూబ్, నల్లగొండ బాబు, రాజేందర్ బోనగిరి, బిగుళ్ల నాగరాజు, శంకర్ వేముల, కోడలోల్ల శ్రీకాంత్ (జక్కాపూర్), నరాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.బాధిత యువకుడి ఆరోగ్యం మెరుగుపడేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని గల్ఫ్ సేవా సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.




