బెజ్జంకి,జూలై 14 (ప్రజావాణి)
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బెజ్జంకి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బంద్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారని, ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో రూ.11 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని, సర్టిఫికెట్లు పొందడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కులేనని, ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర సాయిరాం, దొడ్ల ప్రశాంత్, సంగ రవి, వీరేశం, సాయిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




