📄 ePaper
Wednesday, May 13, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు

📰 Generate e-Paper Clip

*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు*

*ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడుతూ, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ తెలిపారు. బుధవారం మిర్యాలగూడ పరిధిలోని వసుంధర, ఆర్.ఎస్.వి, అనంతసాయి, పారాబాయిల్డ్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మొదటి ప్రాధాన్యతతో అన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. మిల్ పాయింట్‌కు వచ్చిన ప్రతి లారీని 12 గంటల లోపు అన్లోడ్ చేసి తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం లేదా రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరఫున ప్రతి మిల్ పాయింట్ వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా కొంతమంది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, మధ్యవర్తులు రైతులను మోసం చేస్తున్నట్లు పోలీస్ శాఖ దృష్టికి వచ్చినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. రైతుల కష్టార్జిత ధాన్యంపై ఎలాంటి అక్రమాలు, దోపిడీలు, బెదిరింపులు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో “తాలు” పేరుతో ఒక్కో ధాన్య బస్తాకు రెండు నుంచి మూడు కిలోల వరకు అధిక తూకం వేస్తూ రైతులను నష్టపరుస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. అదేవిధంగా మిల్లులకు ధాన్యం చేరుకున్న తర్వాత బస్తా కొద్దీ కటింగ్‌లు వేయడం, నాణ్యత పేరుతో రైతులపై అనవసర ఒత్తిడి తీసుకురావడం, “ఏ గ్రేడ్ ధాన్యాo అని నిర్ధారించి ట్రక్ సీట్ రాసి మిల్లుకు పంపించిన తర్వాత మిల్లర్లు బి గ్రేడ్ కింద దిగుమతి చేసుకుంటామని రైతులను ఇబ్బంది పెడుతూ క్వింటాల్‌కు రూ.20 వరకు తగ్గించి చెల్లింపులు చేయడం వంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇది చాలదన్నట్లు కొంతమంది లారీ యజమానులు, హమాలీలు బస్తాకు అదనంగా రూ.2 చెల్లిస్తేనే ధాన్యం లోడ్ చేస్తామని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. రైతుల బలహీన పరిస్థితిని ఆసరాగా చేసుకుని డబ్బులు డిమాండ్ చేయడం, బలవంతపు వసూళ్లకు పాల్పడడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాల్గొనే ప్రతి అధికారి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, రవాణాదారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రైతుల నుండి ఎలాంటి అక్రమ వసూళ్లు చేసినా, అధిక తూకం వేయించినా, కటింగ్‌లు పెట్టినా, చెల్లింపుల్లో మోసాలకు పాల్పడినా సంబంధిత వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేట్ ధాన్యాన్ని ముందుగా దించుకుంటే లేదా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న పది రోజుల పాటు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని, ఇతర ప్రాంతాల నుండి అక్రమంగా ధాన్యం రాకుండా చెక్ పోస్టుల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎవరైనా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, అదనపు వసూళ్లు, బెదిరింపులు, మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100 కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు,రైస్ మిల్లులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, ఎస్బి సీఐ ఆదిరెడ్డి,రూరల్ సిఐ పి.ఎన్.డి ప్రసాద్, రూరల్ ఎస్.ఐ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular